
ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ అంటే తెలియని వారు ఇప్పుడు ఎవరూ లేరు. ముఖ్యంగా యువత తమ సమయాన్నంతా పబ్‌జీలోనే గడిపేస్తోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాల్లో పబ్‌జీ గేమ్‌ను నిషేధించారు. గుజరాత్‌లో అయితే ఈ గేమ్‌పై గట్టి చర్యలు తీసుకుంటున్నారు.గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద రెండు కేసులు నమోదు చేశారు. అంతకు ముందు 10 మంది పబ్‌జీ గేమ్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్‌తో పాటు వడోదర, సూరత్ లాంటి నగరాల్లో వారం క్రితమే నిషేధం విదించారు. ఇప్పుడు తాజాగా భావ్‌నగర్, గిరి సోమనాథ్ జిల్లాల్లో పబ్‌జీ ఆడటాన్ని నిషేధించారు.ఈ ఆట యువతకు ప్రాణాంతకంగా మారిందని, వారు దీనికి పూర్తిగా బానిసలై పోతున్నారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. అందుకే పబ్‌జీని నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. పబ్‌జీ గేమ్ ఆడితే గట్టి చర్యలు ఉంటాయని, ఆన్‌లైన్ గేమ్‌లపై తాము నిఘా పెంచామని వారు పేర్కొన్నారు.