ముంబైలోని సీఎస్‌టీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫుట్ ఓవర బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారని, 34 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అపూర్వ ప్రభు(35), రంజన తాంబే(40), జాహిద్ శిరాజ్ ఖాన్(32) ను గుర్తించినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. అధికారుల కథనం ప్రకారం.. ఈ ఘటనలో చాలామందికి గాయాలయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో 10 మందిని జీటీ హాస్పిటల్‌కు తరలించారు. మరో 10 మందిని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జార్జ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆసమయంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న వాహనదారులకు కూడా గాయాలయ్యాయి. సీఎస్‌టీ ప్లాట్‌పాం వన్ నార్త్ ఎండ్ నుంచి బీటీ లేన్‌ను ఫుట్ ఓవర్ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది. బ్రిడ్జి కుప్పకూలిపోవడంతో సీఎస్‌టీ ప్రాంతంలో ట్రాఫిక్ స్థంబించింది. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించింది.
దురదృష్టకరమన్న మహారాష్ట్ర సీఎం
సీఎస్ఎంటీ రైల్వేస్టేషన్ కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడం దురదృష్టకరమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. సీఎం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ..ఇటీవలే బ్రిడ్జి పనితీరుపై నిర్మాణాత్మక తనిఖీలు చేశాం. అయితే బ్రిడ్జి దృఢంగానే ఉన్నట్లు తేలింది. తనిఖీలు పూర్తయిన తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటనతో పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జి తనిఖీలకు సంబంధించి విచారణ చేపడ్తాం. ఎవైనా అవకతవకలున్నట్లు నిర్దారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని సీఎం ఫడ్నవిస్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా..36 మందికి పైగా గాయాలయ్యాయి.