ఎన్నారై జయరాం హత్య కేసులో నటుడు సూర్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్‌తో పాటు రియాల్టర్ అంజిరెడ్డిని వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జయరాం హత్య జరిగిన విషయం తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వని కారణంగా వీరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డిసిపి ఎ.ఆర్‌శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నారై జయరాంను హత్య చేసిన అనంతరం రాకేష్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులతో మంతనాలు సాగించినట్లు దర్యాప్తులో తేలిందని డిసిపి వివరించారు. అయితే జయరాం హత్యకేసుతో ఆయా మంత్రులకు సంబంధాలున్నాయా? అన్నకోణంలోనూ దర్యాప్తు సాగుతోందన్నారు. రాకేష్‌రెడ్డి ఫోన్‌డేటాను మరోసారి పరిశీలించి ఎపికి చెందిన మంత్రుల ప్రమేయంపై ఆరా తీస్తామన్నారు.
కాగా ఇప్పటి వరకు జయరాం హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. తాజగా అరెస్టు చేసిన నటుడు సూర్య, కిశోర్, అంజిరెడ్డిలకు సంబంధించిన చార్జ్‌షీట్‌ను 15 రోజుల్లోగా ఫైల్ చేస్తామని తెలిపారు. జయరాం హత్య కేసులో నటుడు సూర్య, కిశోర్, అంజిరెడ్డిలు కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యంగా కిశోర్ అనే వ్యక్తి హానీట్రాప్ చేసి జయరాంను రాకేష్‌రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడని, వీణా అనే అమ్మాయి పేరు చెప్పి జయరాంను తన ఇంటికి తీసుకురావాలని రాకేష్‌రెడ్డి నటుడు సూర్య, కిశోర్‌లకు ఆదేశాలిచ్చాడన్నారు. ఈక్రమంలో జయరాం వద్ద బలవంతంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న పత్రాలను అంజిరెడ్డి తీసుకెళ్లాడన్నారు. హత్య విషయం అంజిరెడ్డికి ముందే తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వని కారణంగా అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి ఏలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
హత్యతో సంబంధంలేదు: నటుడు సూర్య
జయరాం హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని నటుడు సూర్య మీడియాకు తెలిపాడు. అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్‌తో తనకు ఐదేళ్ల పరిచయం ఉందని, తాను చెప్పడం వల్లే కిశోర్ రాకేష్‌రెడ్డి ఇంటికి వచ్చాడని తెలిపాడు. గతంలో రాకేష్‌రెడ్డిని తాను ఐదు సార్లు కలిశానని, తనను వాడుకుని రాకేష్‌రెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు