ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రోజున ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రజా చైతన్య సభలో భాగంగా మాట్లాడిన ఆయన టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ప్రధాని విమర్శలపై తెలుగు తమ్ముళ్లు సీఎం చంద్రబాబు స్పందించి కౌంటర్ల వర్షం కురిపించారు. తాజాగా మోడీ విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీలు కలిసి కూటమి ఏర్పాటు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ టీడీపీ యూటర్న్ తీసుకుంటోందని ప్రధాని విమర్శిస్తున్నారు. మరి గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఎన్నికలయ్యాక మాట తప్పి ఇప్పడు ప్రత్యేక హోదా పదాన్నే ఉచ్చరించ డానికి సిద్ధంగా లేని మీ వైఖరిని యూటర్న్ అనాలి కదా మోడీ గారూ పొత్తుల విషయానికి వస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పొత్తు పెట్టుకుని గెలిచిన నితీశ్ కుమార్ ని అనైతికంగా మీవైపు లాక్కుని రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిన బీజేపీ తీరును యూటర్న్ అనకుండా ఇంకేమంటారు అని మోడీపై విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు.
