రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు.. యావత్ భారతదేశం ఆయన సినిమా కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తుంటుంది. ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగువాడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించారు. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ఆయన దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, అంతకు మించిన ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటికీ జక్కన్న చెక్ పెట్టనున్నట్లు సమాచారం.
‘ఆర్‌ఆర్‌ఆర్’ మొదలైనప్పటి నుంచి నేటి వరకూ ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్ర రాబిన్‌హుడ్ తరహాలో నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని, రామ్‌చరణ్ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని.. బ్రిటిష్ కాలం నాటి కథ అని, ప్రభాస్ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని, ఇక ఇందులో బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్ నటిస్తున్నారని ఇలా రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. వీటికి తోడు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు వారి పాత్రలకు సంబంధించి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మా హీరో పాత్ర గొప్పదంటే.. మా హీరో పాత్ర గొప్పదని కామెంట్లు పెడుతున్నారు. వీటన్నింటికీ మార్చి 14న రాజమౌళి సమాధానం చెప్పనున్నారు. ఆరోజు మీడియాతో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
గతంలో ‘ఈగ’ సినిమా మొదలు పెట్టిన రోజునే సినిమా ప్లాట్ ఏంటో చెప్పేశారు దర్శక ధీరుడు.. ‘బాహుబలి’కీ అదే జరిగింది. ‘మర్యాద రామన్న’కు అయితే, కథతో పాటు నటీనటుల వివరాలు కూడా చెప్పేశారు. ఒక్క ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నఈ చిత్రం తదుపరి షూటింగ్‌ను కోల్‌కతాలో జరుపుకోనుంది. సినిమాకు సంబంధించి అభిమానులకు భేతాళ ప్రశ్నల్లా మిగిలి పోయినవాటికి ఈ మీడియా సమావేశంతో సమాధానం దొరికే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.