Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.

కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. సినీరంగంలో ఆయనది 30 ఏళ్ల ప్రస్థానం. ఆయన 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. ఏకంగా 525 రోజులు ఆడింది. ఆ తర్వాత ‘మంగమ్మగారి మనవడు’, ‘ఆహుతి’, ‘శత్రువు’, ‘అమ్మోరు’, ‘ముద్దుల మావయ్య’, ‘మా ఆవిడ కలెక్టర్’‌, ‘పెళ్లి’, ‘దొంగాట’, ‘అంజి’, ‘దేవీపుత్రుడు’, ‘దేవి’, ‘దేవుళ్లు’ ‘అరుంధతి’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు అర్జున్‌, భానుచందర్‌, సుమన్‌లను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం ఆయనకు లభించింది. 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు కోడి రామకృష్ణ అందుకున్నారు. ‘శత్రువు’ చిత్రానికి ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

అంతేకాకుండా నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా కోడి రామకృష్ణ పనిచేశారు.

Latest News