హైదరాబాద్: సమాచార చట్టంలో ఇప్పటికే సుప్రీంకోర్టు రద్దు చేసిన సెక్షన్ 66 కింద బీజెవైఎం నేత పి.ఎం.సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై వివరణ ఇవ్వాలంటూ గురువారం హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అక్రమ నిర్బంధానికి సంబంధించి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న పోలీసు అధికారులతోపాటు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులకు నోటీసులు జారీ చేసింది. గత నెల 15న తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రోద్బలంతో సిరా రోహిత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను అక్రమంగా నిర్బంధించారని, వారినుంచి రూ.5 లక్షల పరిహారం ఇప్పించాలంటూ సాయిప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పి. నవీన్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శశికిరణ్ వాదిస్తూ, ఐటీ యాక్ట్‌లోని రద్దయిన సెక్షన్‌ను పేర్కొంటూ పిటిషనర్‌పై తప్పుడు కేసు పెట్టారన్నారు. అతడి పరువుకు భంగం వాటిల్లేలా పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే, అనుచరులు బెదిరింపులకు దిగారని చెప్పారు. ‘ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినా, కేసులు వేసినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇది శాంపిల్ మాత్రమే. లేదంటే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది..’ అంటూ పోలీసులు బెదిరించారన్నారు. రద్దయిన సెక్షన్ కింద ప్రధాన కేసు నమోదైతే మేజిస్ట్రేట్ పట్టించుకోకుండా జ్యుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలంది.
