ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణచల్ ప్రదేశ్ పర్యటన వివాదాస్పదంగా మారింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కొరకు మోదీ నేడు (శనివారం) అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై సరిహద్దు దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాస్పద భూభాగంలో మోదీ పర్యటించారని ఇటువంటి చర్యలకు దిగి సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టతరం చేయొద్దని భారత్‌ను హెచ్చరించింది.
‘ద్వైపాక్షిక సంబంధాల నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారత్ ప్రవర్తించాలి. చైనా అభిప్రాయాలను గౌరవిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. సరిహద్దు సమస్యలను వివాదం చేసే చర్యలకు భారత్ దూరంగా ఉండాలి’ అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. కాగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మోదీ పర్యటించన సందర్భంలో కూడా డ్రాగన్ ఇదేవిధంగా వక్రబుద్ధిని ప్రదర్శించింది. బౌద్ధమత గురువు దలైలామా పర్యటించడాన్ని కూడా గతంలో చైనా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చైనా వ్యాఖ్యానించింది.