Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

సమతా మూర్తి

సమత- సమానతా వాదం
— —— ——–
భగవంతుని సేవించడానికి కావాల్సింది కులం కాదు.. అంకితభావం అని ఆచరణలో నిరూపించారు రామానుజులు. అందుకు ఉదాహరణలుగా కనిపించే అనేక ఉదంతాలలో కాంచీపూర్ణులు, దనుర్దాసు ఘట్టాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రామానుజులు సన్యాసాశ్రమం లోకి ప్రవేశించడానికి ముందు కొంతకాలం కాంచీపూర్ణులనే గురువు వద్ద శాస్త్రాభ్యాసం చేశారు. అప్పటికి అందరికీ ఆయన లక్ష్మణార్యుడు గానే ఎక్కువ పరిచయం. అంతకుముందు పలువురు గురువుల వద్ద వేద, శాస్త్రాలను అధ్యయనం చేసినా అవన్నీ ఒక ఎత్తు, కాంచీపూర్ణుల వద్ద శిష్యరికం మరో ఎత్తు. కాంచీపూర్ణులు వైశ్యకులజులు కావడమే అందుకు కారణం. ” దివ్య సత్య మార్గం నాకు బోధించండి ” అంటూ కాంచీపూర్ణులను లక్ష్మణార్యుడు వేడుకొనడంతో , కొంత సంశయిస్తూనే ఆయన అంగీకరించారు. కంచి వరదునికి కాంచీపూర్ణులు అత్యంత సన్నిహితులు గా చెబుతారు. ” నేను వైశ్యుడను. నీవు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడివి. నీవు నావద్ద శిష్యరికం చేస్తే పెద్దలు ఆమోదించరు. అందువల్ల నీకు తగిన ఆచార్యుని చూసుకో ” అని కాంచీపూర్ణులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే లక్ష్మణార్యుడు ససేమిరా అంటాడు. ” ఈ సంకుచిత కుల నియమాలతో నాకు సంబంధం లేదు. మీ వద్ద ఎనలేని భక్తి, విజ్ఞానం ఉన్నాయి. నాకు కావాల్సినవి అవే, కులం కాదు..” అంటూ కాంచీపూర్ణులను ఎట్టకేలకు ఒప్పిస్తారు. తర్వాత వారిద్దరి మధ్య గురుశిష్య సంబంధం కంటె మైత్రీ బంధం ఎక్కువగా పెరుగుతుంది. ” నాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ సమాజం కట్టుబాట్లకు బద్ధుడను. నీవైనా అలాగే ఉండాలి” అంటూ కాంచీపూర్ణులు హితబోధ చేస్తూనే ఉంటారు. కానీ లక్ష్మణార్యుడు మాత్రం తాను నమ్మిన బాటలోనే నడుస్తూంటాడు. ” మన స్నేహాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. మనం ఎప్పటికీ గురు శిష్యులు మే ” అని ప్రకటిస్తాడు. కొంతకాలం అలా సాగిన తర్వాత, ఒకరోజు కాంచీపూర్ణుని లక్ష్మణార్యుడు మధ్యాహ్న భోజనానికి పిలుస్తాడు. ఆయన వచ్చి భోజనం చేసి వెళ్తాడు. అయితే లక్ష్మణార్యుని భార్య రక్షకాంబకు అది ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అన్యకులజుడు అనే అభిప్రాయం తో కాంచీపూర్ణులను ఆమె చిన్న చూపు చూస్తుంది. భోజనం చేసిన తరువాత విస్తరాకును ఒక కర్రతో తొలిగించి, ఆయనకు ఎటువంటి మర్యాదలు చేయకుండానే పంపించి వేస్తుంది. అది గమనించిన లక్ష్మణార్యుడు ఆగ్రహోదగ్రుడై భార్యను తీవ్రంగా మందలిస్తాడు. తర్వాత అటువంటి ఘటనలే మరో రెండు కూడా జరుగుతాయి. లక్ష్మణార్యునికి ఆమెను భరించడం చాలా కష్టంగా మారుతుంది. ఆమె తన ఆలోచనలకు, ఆశయాలకు అడ్డుపడుతున్నదనే అభిప్రాయంతో, ఆమెను త్యజించడానికే సిద్ధపడతాడు. మరికొన్ని రోజులకు అదే జరిగింది. ఇద్దరి మధ్య సయోధ్య లోపించడంతో, సిద్ధాంత విభేదాలు పెరగడంతో చివరికి భార్యను పుట్టింటికి పంపించి వేస్తాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు లక్ష్మణార్యుడు. అప్పటినుండి రామానుజాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. 1047లో సన్యాసం స్వీకరించినప్పటినుండి విశిష్టాద్వైత ప్రచారానికి దేశమంతా విస్తృతంగా పర్యటించారు. 1054లో శ్రీ భాష్యం రచన చేసే సమయానికి ఆయన పేరు, ఆయన సంస్కరణలు దేశమంతా మోగిపోతున్నాయి. ప్రజలలో నాటుకుపోయిన కుల వివక్షను సమూలంగా పెకలించి వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు.
తనకు పరమ భక్తుడైన ధనుర్దాసు విషయంలో కూడా అటువంటి ప్రతిబంధకాలనే రామానుజులు తొలుత ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన రోజూ కావేరీ నదిలో స్నానానికి వెళ్లేవారు. వెంట కొందరు శిష్యులు ఉండేవారు. వారిలో తనకు అత్యంత ప్రియమైన దాశరథి అనే శిష్యుని భుజంపై చేయివేసి నదికి వెళ్లేవారు. వచ్చేటప్పుడు మాత్రం ధనుర్దాసు భుజంపై చేయివేసి వచ్చే వారు. కానీ ధనుర్దాసు బ్రాహ్మణేతరుడవడంతో మిగిలిన శిష్యులు అభ్యంతరం చెప్పేవారు. దానికి ఆయన సమాధానం చెబుతూ ” పుట్టుకతో వచ్చిన కులం కన్నా జ్ఞాన కులమే మిన్న. ధనుర్దాసు బ్రాహ్మణుడు కాకపోవచ్చు. కానీ మిగిలిన అన్ని విషయాలలోను అతను అందరి కంటె శ్రేష్ఠుడు. విద్య, ధనం, కులం వల్ల వచ్చే ఎలాంటి వదరుబోతుతనము అతడిలో లేదు. అతడి ఔన్నత్యానికి కారణం అదే. నేను భుజంపై చేయివేసి నడిచే స్థాయికి అతను ఎదిగాడు గనుకనే అలా చేస్తున్నాను. ” అనడంతో మిగిలిన శిష్యులంతా అవాక్కయ్యారు. భార్య మోజులో శ్రీరంగనాథుని సైతం లెక్క చేయని ధనుర్దాసు మనస్తత్వాన్ని మార్చి వేసి, అతనిలో ఎంతో పరివర్తన తెచ్చి శిష్యునిగా చేసుకున్నారు రామానుజులు.
అలాగే కర్ణాటక లోని మేల్కొటేలో దళితులచేత ఆలయ ప్రవేశం చేయించి వినూత్న సంస్కరణలకు ఆయన నాంది పలికారు. అక్కడ తిరునారాయణుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడంలో దళితులకు ప్రాధాన్యమివ్వడమే గాక కొందరిని తన శిష్యులుగా కూడా చేసుకున్నారు. అంతేగాక వారికి ” తిరుక్కులత్తార్ ” ( శ్రీ కులం) అనే గౌరవప్రదమైన పేరును పెట్టి వారికి అగ్రాసనం కల్పించారు రామానుజులు. అందుకే ఆధునిక కాలంలో అంబేద్కర్ సైతం రామానుజుల సంస్కరణలను ఎంత గానో ప్రశంసించారు. దళితులకు ఆ పేరు తీసివేసి తిరుక్కులత్తార్ అనే పేరు పెట్టడం అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది.

Latest News