Welcome to Telugu News Features web portal

Editor: A. Radha Devi

రామానుజ సహస్రాబ్ది

ఓ జనులారా! జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు. అది సమాజంలో ప్రతిఒక్కరికి చెందాలి. ప్రతి ఒక్కరూ ఆ జ్ఞాన కాంతిలో మెరవాలి. అజ్ఞాన తిమిరం నుంచి ప్రజలంతా బయటకు రావాలి. అందుకే నేను గ్రహించిన జ్ఞానాన్ని మీ అందరికీ పంచాలనుకుంటున్నాను. ఈ జ్ఞానం తో మీరు పునీతులు కండి. జ్ఞాన సాధనకు మనుషులందరూ అర్హులే. వర్ణభేదం గాని, కులభేదం గాని దానికి లేదు. సర్వమానవ సమానత్వం ఆ భగవంతుని లక్షణం. దేవుని దృష్టిలో లేని భేదాలు మనుషులు సృష్టించడమేమిటి ? అందుకే మనలో మార్పు రావాలని కోరుతున్నాను. మీరందరు కూడా ఆ నారాయణుని అర్థం చేసుకునే మంత్రార్ధం తెలుసుకోండి.”
ఓ గుడి గోపురం ఎక్కి, ఉచ్ఛ్చైస్వరం తో ప్రతిమాట స్పష్టం గా పలుకుతూ, ప్రజల్లో చైతన్యం తేవడానికి దాదాపు వెయ్యేళ్ళ క్రితం రామానుజులు ఇచ్చిన పిలుపు అది. ఇలాంటి మార్పునకు ప్రజలంతా తొలుత ఆశ్చర్యపోయారు. అంతవరకు తాము చూసింది వేరు, ఆప్పుడు చూస్తున్నది వేరు. తమను దగ్గరికి రానివ్వకుండా , భగవంతుని నామస్మరణమే తమ నాలుకకు చేరకుండా, ఎక్కడో దూరంగా ఉంచిన తమను ఏమిటీయన ఇలా భగవంతుని జపించే మంత్రాలు చెబుతానంటున్నాడు! మిమ్మల్ని గుళ్లో కి రమ్మంటున్నాడు! అందరిలోను అవే ఆలోచనలు. కొన్ని వర్గాల ప్రజలు గుళ్లో కి వెళ్తే ఆ గుడి మైలపడిపోతుందనుకునే భ్రష్టాచారం ఊడలు దిగిన రోజుల్లో .. రామానుజులు ఇచ్చిన ఆ పిలుపు నిజంగా ఒక విప్లవమే. ఒక ఆచార్యుడేమిటి! అలాంటి పిలుపు ఇవ్వడ మేమిటి! సంప్రదాయవాదులు నోళ్లు నొక్కుకున్నారు. ఆయన గురువు ఆగ్రహం ప్రకటించి ఏకంగా తీవ్రమైన శాపాన్నే ఇచ్చారు. ” గురూపదేశాన్ని ధిక్కరించావు గనుక నరకానికి పోతావు ” అని శపించారు. అందుకు రామానుజులు విచారించలేదు. ” నేనొక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు. నారాయణ మంత్రం జపించిన ఆ ప్రజలందరికీ మోక్షం లభిస్తే చాలు. అని ప్రకటించి మళ్లీ, మళ్లీ ప్రజలందరి చేత మంత్రాన్ని మననం చేయించారు రామానుజులు. అప్పట్లో నిజంగానే అదొక గొప్ప ఆధ్యాత్మిక విప్లవమనే చెప్పాలి. ప్రవాహం దారిని ఆయన మార్చారు, కొత్త దారిలోకి ప్రవాహాన్ని మళ్లించారు.
గురువు గోష్ఠీపూర్ణులు పెట్టిన పరీక్ష లన్నిటిలోను 18 పర్యాయాలు విజయం సాధించి, మంత్రోపదేశానికి అర్హులయ్యారు రామానుజులు. అది సాధారణ మైనది కాదు. జనన,మరణ చక్రం నుంచి జీవుని విముక్తం చేసే నారాయణ మంత్రం. మునులు, రుషుల అధీనంలో మాత్రమే ఉండే మంత్రం. దానిని జపించడానికి ఎంతో సాధన అవసరం. మంత్రాన్నేగాక , మంత్రార్థాన్ని , విశేష రహస్యాలను కూడా రామానుజులకు బోధించారు గోష్ఠీపూర్ణులు. చివరలో చెప్పారు..” ఇది చాలా గొప్ప మంత్రం. భౌతిక కార్యకలాపాలపై ఎంతమాత్రం అనురక్తి లేనివారికి మాత్రమే ఈ రహస్యాన్ని చెప్పాలి. ” అని చెప్పారు గోష్ఠీపూర్ణులవారు. కానీ.. రామానుజులకు ఏం జ్ఞానోదయమైందోగాని గురువు గారి వద్దనుంచి బయిటకు రాగానే సుదీర్ఘంగా యోచించి , చివరికి ప్రజలందరికీ నారాయణ మంత్ర రహస్యాన్ని బోధించాలనే నిర్ణయానికి వచ్చి, తక్షణమే ఆచరణలో పెట్టారు రామానుజులు. అది మొదలు ఆధ్యాత్మిక మార్గమే కొత్త పుంతలు తొక్కింది. తిరుగోష్ఠియూరులో జరిగిన ఆ ఘటన ప్రజలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది.

Latest News