చుట్టూ 108 ఆలయాలు. మధ్యలో 216 అడుగుల ఎత్తైన రామానుజుల భారీ విగ్రహం. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్ద చినజీయర్ ఆశ్రమంలో కొలువైన రామానుజ మూర్తి ఇప్పుడు ప్రధాన మైన ఆకర్షణ. సహస్రాబ్ది సందర్భంగా ఆ విశిష్టాద్వైత పరమాచార్యునికి చినజీయర్ ట్రస్ట్ అందిస్తున్న అనుపమాన మైన నివాళి అది. నిజమే.. రామానుజుల అద్వితీయమైన ప్రతిభకు ఆ అతిపెద్ద విగ్రహం నిలువెత్తు నిదర్శనం. జీవించిన 120 యేళ్లలో రామానుజులు అదే తరహాలో విరాట్ స్వరూపం ప్రదర్శించారు. ఒక గొప్ప సంఘసంస్కర్త గా, సమాజం లోని దురాచారాలను తొలిగించి సమసమాజ స్థాపనకు అనితరసాధ్యమైన కృషి చేసిన ఆచార్యునిగా ఆయన అందించిన సేవలు అనుపమానం. 1017లో తమిళనాడు లోని శ్రీపెరంబుదూరులో జన్మించి, కాంచీపురంలో శాస్త్రాధ్యయనం చేసి, శ్రీరంగంలో పీఠాధిపత్యం స్వీకరించిన మహర్షి గా రామానుజులు నడయాడిన నేల.. ఆరోజు నుంచి నేటి వరకు ఎన్నో సంస్కరణలకు ఆలవాలమైంది. వైదిక యజ్ఞా లలో జంతుబలిని నిషేధించి అప్పట్లో విమర్శలకు గురైనా, తర్వాత సమాజమంతా ఆయన విధానాలకే స్వరం కలిపింది. జాతి, కుల, మతాలతో గాని, ఇతర సామాజిక కట్టుబాట్లతో గాని సంబంధం లేకుండా సర్వ మానవ శ్రేయస్సును కాంక్షించి జాతి జనులందరికి మార్గనిర్దేశం చేశారు రామానుజాచార్యులు. మంత్రోపదేశానికి అందరూ అర్హులే అని ప్రకటించి దేశం మొత్తం తనవెనుకే నడిచేట్లు చేశారు. 33వ యేట సన్యాసాశ్రమం స్వీకరించి , ఆతర్వాత దేశమంతా పర్యటిస్తూ ఆరు దశాబ్దాలు పైగా విశిష్టాద్వైత పరమాచార్యునిగా విఖ్యాతి గడించారు. కర్ణాటక లోని మేల్కొటే ఆలయంలోకి దళితులను ప్రవేశపెట్టి ఆనాడే గొప్ప చరిత్రను సృష్టించినవారాయన. స్వామి నారాయణ్, ఇస్కాన్, వల్లభ, రామానంద మొదలైన దేశంలోని సమస్త వైష్ణవ సంప్రదాయాలకు మూలపురుషునిగా ఆధ్యాత్మిక ప్రపంచం మన్ననలందుకున్న ” విశిష్ట” ఆచార్యుడాయన.
కేశవసోమయాజి, కాంతిమతి దంపతులకు జన్మించిన లక్ష్మణార్యులు ( రామానుజులు) ఎన్నో ఉద్గ్రంథాలను రచించి, విశిష్టాద్వైత వైభవానికి ఎనలేని కృషి చేశారు. వేదార్థ సంగ్రహం, వేదార్థ దీప, వేదాంతసారం, శ్రీ వైకుంఠ గద్యం, శ్రీ భాష్యం, గీతాభాష్యం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం వంటి అసాధారణ మైన గ్రంథాలెన్నిటినో ఆయన రచించారు. ఉడయవర్, ఎంబెరుమనార్ వంటి విశేషనామాలతో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. భవిష్యదాచార్యుడే రామానుజులు అని యామునాచార్యులు, శ్రీశైల పూర్ణులు వంటి మహా విద్వాంసుల మెప్పు పొందిన ఆయన తన జీవిత మంతా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారానికే అంకితం చేశారు.
