కొత్త విధానం ద్వారా కేబుల్ టీవీ బిల్లు 25 శాతం పెరిగే అవకాశాలున్నాయని క్రిసిల్ ఇచ్చిన నివేదికను ట్రాయ్ తోసిపుచ్చింది. ఏ ఛానళ్లు చూడాలో ఎంపిక చేసుకొనే విధానం ద్వారా సగటు వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పేర్కొన్నారు. క్రిసిల్ నివేదిక తప్పుగా ఉందని, అవాస్తవంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
‘వినియోగదారులకు కచ్చితంగా ఎంపిక చేసుకొనే అవకాశం ఉండాలి. వారి స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఉల్లంఘించడమే అవుతుందని’ అని శర్మ తెలిపారు. ఒకే ఇంట్లో ఎక్కువ కనెక్షన్లు అవసరమైన వారి కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆపరేటర్లకు సూచించారు. కొత్త విధానం ద్వారా తన కేబుల్ బిల్లు తగ్గిందన్న శర్మ ఎలా తగ్గిందో మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
ప్రస్తుతం రూ.230-240 ఉన్న బిల్లు కొత్త విధానం ద్వారా టాప్-10 ఛానళ్లను ఎంచుకొంటే నెలకు రూ.300కు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అదే టాప్-5 ఛానళ్లను ఎంచుకొంటే కొంత తగ్గుతుందని పేర్కొంది. అయితే ఈ నివేదిక టీవీ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని ట్రాయ్ ఛైర్మన్ శర్మ అన్నారు. దాదాపు మూడు నెలల్లోనే వేర్వేరు ఛానళ్ల ధరలు తగ్గుతాయని శర్మ అంచనా వేశారు.