భారతదేశంలో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది. భారత్ విచారణకు మాల్యాను అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు చెప్పిన రెండు నెలలకు, బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావిద్ సోమవారం ఆమోదం తెలిపారు.
మాల్యా భారతదేశం రావడానికి ఎంత సమయం పడుతుంది, మాల్యా ముందున్న మార్గాలేమిటి, బ్రిటన్‌లో అప్పీలు ప్రక్రియ గురించి బీబీసీ అక్కడి న్యాయనిపుణులతో మాట్లాడింది.
మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను అప్పగించాలని కోరుతూనే ఉంది.
అప్పగింతకు కోర్టు ఉత్తర్వు ఇస్తే దానిని తిరస్కరించే విచక్షణాధికారం హోం మంత్రికి దాదాపు లేదని, అందువల్ల ఉత్తర్వుకు హోం మంత్రి ఆమోదం తెలపడం ఆశ్చర్యకరమేమీ కాదని ‘పీటర్స్ అండ్ పీటర్స్’ న్యాయసేవల సంస్థ భాగస్వామి నిక్ వామోస్ చెప్పారు. వ్యాపార నేరాల కేసులను వాదించడంలో ‘పీటర్స్ అండ్ పీటర్స్’ సంస్థకు అనుభవం, నైపుణ్యం ఉన్నాయి.
కింది కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తానని మాల్యా నిరుడు చెప్పారని నిక్ వామోస్ ప్రస్తావించారు. ఇప్పుడు అప్పీలు దాఖలుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉందని, దీనిని మాల్యా న్యాయవాదులు సిద్ధం చేసే ఉంటారని భావిస్తున్నానని ఆయన చెప్పారు.
నిక్ వామోస్ గతంలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో ప్రత్యేక నేరాలు, నిందితుల అప్పగింత కేసుల విభాగాలకు నేతృత్వం వహించారు.